చెన్నై చిందేసెన్‌ వాట్సన్‌ విధ్వంసక శతకం

సూపర్‌ కింగ్స్‌దే ఐపీఎల్‌-11
మూడోసారి టైటిల్‌ గెలిచిన ధోనీ సేన
ఫైనల్లో ఓడిన సన్‌రైజర్స్‌
అహో.. వాట్సన్‌! మామూలు విధ్వంసమా అది.. అరివీర భయంకరం. ఆ బాదుడుకు వాంఖడే దద్దరిల్లిపోయింది. ఆ జోరుకు సన్‌రైజర్స్‌ తల్లడిల్లిపోయింది. పిసినారి హైదరాబాద్‌ బౌలర్లపై పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడ్డ వాట్సన్‌.. మళ్లీ ఎప్పుడూ బంతి దొరకదేమోనన్నట్లు కసిదీరా బాదేశాడు. తీవ్ర ఒత్తిడిలో, కఠిన పరిస్థితుల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే షాట్లతో చిరస్మరణీయ శతకం సాధించాడు. దక్షిణ జట్ల ధనాధన్‌ యుద్ధంలో చెన్నైదే విన్నింగ్‌ షాట్‌!
షేన్‌ పరుగుల వరదలో సన్‌రైజర్స్‌ కొట్టుకుపోయిన వేళ.. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌-11 విజేతగా నిలిచింది. 8 వికెట్ల విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ముదుర్ల జట్టన్న వారికి ముదుర్సే అదుర్స్‌ అని నిరూపించింది.
చెన్నై ఆరంభం అనూహ్యం.. ముగింపు అద్భుతం. 179 పరుగుల ఛేదనలో 5 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 20 పరుగులే చేసిన ఆ జట్టు పుంజుకున్న తీరు అపూర్వం. 11వ బంతికి కానీ ఖాతా తెరవని వాట్సన్‌ విరుచుకుపడ్డ తీరు అద్వితీయం.
రెండేళ్ల ‘నిషేధ’ వేదన తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెట్టినా.. సొంతగడ్డపైనా ఆడలేకపోయిన సూపర్‌కింగ్స్‌కు ఇంతకన్నా గొప్ప ఊరట, ఇంతకన్నా గొప్ప బహుమతి ఏముంటుంది? చెన్నై కళంకాన్ని కూడా కడిగేసిన విజయమిది.

Related posts

Leave a Comment