మగాళ్లు లేని ఆ వూరు గురించి తెలుసా ?

మహిళల  కోసం మహిళలే నిర్మించుకున్న  గ్రామం అది . అక్కడ మగవాళ్లకు  ఏ మాత్రం  ప్రవేశం లేదు. మగవాళ్లు వూళ్లోకి రావడానికి కూడా వారు ఒప్పుకోరు. గృహహింస, మగాళ్ల వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలకు గురైన  మహిళలు , భర్త వదిలేసిన వారు, వితంతువులకు ఈ గ్రామం రక్షణ కల్పిస్తుంది. అలాంటి బాధితులతోనే ఈ వూరు ఏర్పడిందంటే మహిళలపై అక్కడ జరిగే దారుణాలను అర్థంచేసుకోవచ్చు. మహిళలు, బాలికలకు ఆ గ్రామం స్వర్గం లాంటిది. ఈ గ్రామం కెన్యాలో ఉంది. దాని పేరు  ఉమోజా!!
కెన్యా ఉత్తర ప్రాంతంలో రెబెకా అనే మహిళ 25ఏళ్ల క్రితం కేవలం మహిళల కోసమే ఉమోజా అనే  గ్రామాన్ని  ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి మహిళల రక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమోజా గ్రామ ప్రస్తుత చీఫ్ ఆమె. రెబెకా అక్కడి సంబూరు తెగకు చెందిన మహిళ. గతంలో అక్కడ  బ్రిటిష్ సైనికులు శిక్షణ పొందేవారట , ఆ సమయంలో వారి అకృత్యాలకు హద్దు ఉండేది కాదట . తదనంతరం  అక్కడి పురుషులు కూడా  మహిళలను విపరీతంగా కొట్టేవారు. ఓ రోజు గ్రామంలో వ్యక్తులు ఆమెను విపరీతంగా కొడుతుంటే భర్త అడ్డుకోలేదట. ఇక పురుషులకు దూరంగా కొత్త గ్రామాన్ని నిర్మించుకోవాలని అనుకొని 1990లో ఉమోజా గ్రామం ఏర్పాటు కు మొదలుపెట్టారు.క్రమంగా  ఎందరో బాధితులు ఆమెతో చేరిపోయారు. గ్రామం ఏర్పాటైంది. భర్త వేధింపులు తాళలేక వచ్చేసిన వారు, భర్త చనిపోయిన వారు, అత్యాచారాలకు గురైన వారు, అనాధలు, బలవంతపు పెళ్లిళ్లు వద్దనుకొని పారిపోయి వచ్చినవారు.. ఇలా ఒకరా ఇద్దరా ఎంతో మంది ఎన్నో రకాల మగవాళ్ల వేధింపులు తట్టుకోలేక బయటపడ్డ మహిళలకు ఈ గ్రామం  అండగా నిలిచింది. పురుషులకు ప్రవేశం లేదని  చెప్పి ఇప్పుడు బాధిత మహిళలు ఉమోజా గ్రామంలో సంతోషంగా బతుకుతున్నారు.
గ్రామంలో మహిళలు బతుకుతెరువు కోసం రకరకాల ఆభరణాల తయారీ, ఇతర ఎన్నో పనులు చేస్తుంటారు. ఇలా వారు ఇళ్లు కట్టుకున్నారు. పిల్లలు చదువుకోవడానికి పాఠశాల కూడా నిర్మించుకున్నారు. కమ్యునిటీ సెంటర్, ఇంకా ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఉమోజా గ్రామం పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చెందుతోంది. మగవాళ్లకు ఈ గ్రామంలోకి రావడానికి అనుమతి లేదు. కానీ పర్యటకులకు మాత్రం వారు పెట్టిన కొన్ని నిబంధనలకు ఒప్పుకుంటే సందర్శనకు అనుమతి ఇస్తారు.

 

Related posts

Leave a Comment