రూ.925 కోట్ల దొంగతనాన్ని అడ్డుకున్నారు


దేశంలో ఇదే అతిపెద్ద దొంగతనమట

ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా రూ.925 కోట్ల డబ్బును దోచేయాలనుకున్నారు కొందరు దుండగులు. కానీ దేవుడి దయ వల్ల ఓ 27 ఏళ్ల కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ దొంగతనం జరగలేదు. రాజస్థాన్‌లోని ఓ ప్రధాన బ్యాంక్‌కు కన్నమేసి ఇంతటి మొత్తంలో డబ్బు దోచుకోవాలని కొందరు వ్యక్తులు కుట్ర పన్నినట్లు జయపుర ఏసీపీ ప్రఫుల్ల కుమార్‌ బుధవారం వెల్లడించారు.సోమవారం ఉదయం జయపురలోని ఓ బ్యాంక్‌ వద్దకు 13 మంది దుండగులు ముసుగులు వేసుకొచ్చారట. సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి లోపలికి చొరబడేందుకు యత్నించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న సీతారామన్‌ అనే కానిస్టేబుల్‌ వారిపై కాల్పులు జరిపినట్లు ఏసీపీ ప్రఫుల్‌ కుమార్‌ తెలిపారు. అప్పటికే మిగతా పోలీసులను అలర్ట్‌ చేయడంతో దొంగలు పారిపోయారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సీతారామన్‌ను ప్రఫుల్‌ ప్రశంసించారు.దొంగలను పట్టుకునేందుకు బ్యాంక్‌ పరిసరాల్లో ఏర్పాటుచేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తు్న్నట్లు ఏసీపీ తెలిపారు. ఆ డబ్బు కానీ దొంగల చేతికి చిక్కి ఉంటే దేశంలో ఇదే అతిపెద్ద దొంగతనం అయివుండేదని పేర్కొన్నారు.‘రాజస్థాన్‌లోని వివిధ బ్యాంకులకు నగదును ఈ బ్యాంక్‌ నుంచే తరలిస్తుంటారు. సోమవారాల్లోనే ఈ బ్యాంక్‌లో డబ్బు ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్న దొంగలు ముందస్తుగా పథకం రచించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నాం’ అని పేర్కొన్నారు. అయితే ఈ బ్యాంక్‌లో భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేవని, బ్యాంక్‌ ప్రధాన శాఖల్లో ఉండాల్సిన టైమ్‌ లాక్‌లు ఈ బ్రాంచ్‌కు లేవని మరో పోలీసు అధికారి ఆరోపిస్తున్నారు.

Related posts

Leave a Comment