అయ్యా మోడీ ఇది 2018..2014 కాదు..మీరిప్పుడు ప్రధానమంత్రి

టిడిపి-బిజెపి డ్రామా రక్తి కట్టింది. పార్లమెంట్‌లో టిడిపి ఎంపిలు ప్లకార్డులతో షో చేస్తుంటే, నరేంద్రమోడీ కూడా మోళీ కట్టేశాడు. ఆయన లోక్ సభలో ప్రసంగిస్తుంటే..ఒక్కసారిగా టైమ్ మెషీన్‌లో 2014కి ముందు రోజులకు వెళ్లినట్లైంది. అయ్యా మోడీగారూ ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, మీ పార్టీనే అధికారంలో ఉంది అని గుర్తు చేయాలేమో అన్పించింది.
ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్ తలుపులు మూసి విభజన చేస్తే..దానికి వంతపాడింది మీరు కాదా..! అంజయ్యని రాజీవ్ గాంధీ అవమానించాడనే మీరు..16నెలలుగా ఏపి సిఎంకి ఎందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదో చెప్పగలరా..”ఇందిరాగాంధీని సంజీవరెడ్డి ఓడించారు..కాంగ్రెస్ ని ఎన్టీఆర్ 3నెలల్లో ఓడించారు.”.ఈ కామెంట్లన్నీ ఇప్పుడెందుకు ప్రభూ..? మన్మోహన్ సింగ్ పేరుకే ప్రధానమంత్రి …ఇదీ మీ ఆరోపణ ..ఓకే ఆయన ఒట్టి బొమ్మే అనుకుందాం కాసేపు..మరి మీరిప్పుడు ఉక్కుమనిషి కదా…మీకు ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయకుండా ఏ శక్తులు అడ్డుపడుతున్నాయో చెప్పగలరా…?
కాంగ్రెస్ తప్పు చేసింది కాబట్టేనయ్యా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. ప్రత్యేకహోదా అనే బ్రహ్మాండ వాగ్ధానాన్ని ఇచ్చింది మీరే..పదేళ్లు అమలు చేస్తామన్నదీ మీరే..మరిప్పుడు ప్లానింగ్ కమిషన్ రద్దు అయింది కాబట్టి హోదా కుదరదని తెగేసి చెప్తోందీ మీరే..అసలు ప్లానింగ్ కమిషన్‌ని రద్దు చేసింది మీరు కాదా..! నాలుగేళ్లపాటు కుంభకర్ణుడి కజిన్ బ్రదర్లా నిద్రపోయిన ఆంధ్రప్రదేశ్ ఎంపిలు ఇప్పుడు చలనం వచ్చిఏదో డ్రామా చేస్తుంటే దాన్ని మించిపోయేలా మీరు చేసిన ప్రసంగానికి ఓ లాజికల్ ఎండ్ ఎప్పుడు ఇస్తారని ఏపీజనం ఎదురు చూస్తున్నారు
ఇంతకీ మీరు రైల్వే జోన్ ఇచ్చినట్లేనా…ప్రత్యేకహోదా వర్తింపజేసినట్లేనా..కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టినట్లేనా..ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టినట్లేనా..భీభత్సమైన పోర్టుల అభివృధ్ది జరిగినట్లేనా…ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవయ్యా జనధన్ మోడీ..అది చెప్పకుండా అంతేవాసుల మధ్య ఆపసోపాలు ఎందుకు..? జవాబులు చెప్పాల్సింది నువ్వే ఎందుకంటే నువ్ ఇప్పుడు ప్రతిపక్షనేతవి కాదు..ప్రధానమంత్రివి!

Related posts

Leave a Comment