చేయి చేయి ప‌ట్టుకుని.. రైలు కింద‌ త‌ల‌పెట్టి

ఒకరి చేయి ఒకరు పట్టుకుని రైలు పట్టాలపై తలపెట్టి… తనువు చాలించిన ఇద్దరి హృదయవిదారక ఘటన ఇది. వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. అమలాపురం అప్పలరాజు(24), బుడుమూరు పద్మ (18)లది  శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేవలస గ్రామం. వీరు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అప్పలరాజు చిన్న అక్క రాజుతో పాటు మరి కొంత మంది కుటుంబ సభ్యులు  బెండిగేట్‌ సమీపంలోని నందిగాం మండలం కవిటి అగ్రహారం వద్ద ఇటుకల పరిశ్రమలో పని చేస్తున్నారు. అప్పలరాజు కూడా ఈ ప్రాంతంలో ఉంటూ స్థానిక ఇటుక పరిశ్రమలో పని చేసేవాడు. శ్రీకాకుళంలోని ఓ కళాశాలలో పద్మ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరూ ఈ ప్రాంతానికి తరచూ వచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అప్పలరాజు సొంత ఊళ్లోనే ఇటుకల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే గురువారం వీరిద్దరూ బెండిగేటు వద్దకు వచ్చి ప్రాణాలు తీసుకోవటం కలకలం రేపింది.

పెళ్లికి ముందు నుంచి అప్పలరాజుకు పెద్దక్క కాములమ్మ కుమార్తె లావణ్యతో పూండిలోని ఓ కళ్యాణ మండపంలో 2015లో వివాహం జరిగింది. వీరికి ఆరు నెలల చాద్విక్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వివాహం ముందు నుంచి అప్పలరాజు, పద్మల మధ్య  ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. అప్పలరాజు తండ్రి అమ్మడు పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తల్లి అమ్మన్నమ్మ వద్ద ఉంటున్నాడు. పద్మ తండ్రి రాజారావు మృతి చెందాడు. తల్లి సీతమ్మ, ఒక అన్నయ్య ఉన్నాడు.

ఇక వీరికి దిక్కెవరు 
అప్పలరాజు మృతితో భార్య లావణ్య, ఆరు నెలల కుమారుడికి దిక్కెవరంటూ పలువురు వాపోయారు. ప్రస్తుతం వీరు సొంత గ్రామం తండేవలసలో ఉంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. శుక్రవారం శవపంచనామా నిర్వహిస్తామని వివరించారు.

Related posts

Leave a Comment