ప్రేమజంటకు పెళ్లి చేయించిన ఎస్సై కిరణ్‌కుమార్‌….

వాజేడు :ఫోన్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదువు పూర్తయ్యాక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ప్రియుడు తనను కాదని మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమచారం తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై కిరణ్‌కుమార్‌ చొరవ తీసుకొని ప్రేమజంటకు పెళ్లి చేయించిన ఘటన గురువారం ఖమ్మం జిల్లా వాజేడులో చోటుచేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. చర్ల మండలం చీమలపాడుకి చెందిన ఇర్ప సుమలత, వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన గజ్జల రాంబాబు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం తెలియని కుటుంబ సభ్యులు రాంబాబుకు వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఇటీవల పెళ్లి సంబంధం కుదుర్చుకుని నిశ్చితార్థం చేసుకున్న రాంబాబుకు గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి సమాచారం తెలుసుకున్న సుమలత వాజేడు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రేమ వ్యవహారంపై రాంబాబును ఎస్సై ప్రశ్నించడంతో వాస్తవమేనని అంగీకరించాడు. ఎస్సై ఇరువర్గాలతో చర్చించడంతో ప్రేమించిన యువతినిపెళ్లి చేసుకునేందుకు రాంబాబు అంగీకరించాడు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో గురువారం పోలీస్‌స్టేషన్లో వివాహం జరిపించారు.

Related posts

Leave a Comment